Secretariat | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : సచివాలయానికి వాస్తుదోషం పట్టిందట. దీంతో ప్రభుత్వం మరో కొత్త గేటుతోపాటు అంతర్గత రోడ్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సోమవారం నుంచి శనివారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి హుటాహుటిన పనులు చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే వాస్తు పేరుతో సచివాలయంలో కొన్ని మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం కార్యాలయాన్ని కూడా ఆరో ఫ్లోర్ నుంచి పైఅంతస్థులకు మార్చేందుకు పనులుచేపట్టారు. ఇవి జరుగుతుండగానే తాజాగా మరో గేటు ఏర్పాటుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. తూర్పు ప్రహరీకి అదనపు గేటు ఏర్పాటుతోపాటు తూర్పు నుంచి నార్త్ ఈస్ట్‌గేట్-4 నుంచి సౌత్ ఈస్ట్‌గేట్-2 వరకు 48 అడుగుల వెడల్పుతో కొత్తగా అంతర్గత రోడ్డు ఏర్పాటుకు ఆర్అండ్బీ శాఖ టెండర్లు ఆహ్వానించింది.
సుమారు రూ.1.73 కోట్ల అంచనాతో చేపట్టనున్న ఈ పనులకు స్వల్పకాల టెండర్లు ఆహ్వానించారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే టెండర్లకు గడువు ఇవ్వడం విశేషం. 24న సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్, 26న మధ్యాహ్నం ఒంటిగంటకు వాణిజ్య బిడ్‌ను తెరిచి టెండర్లు ఖరారు చేయనున్నారు. అనంతరం వెంటనే పనులు చేపట్టి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు. సచివాలయ ప్రహరీకి ప్రస్తుతం నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలు ఉన్న విషయం తెలిసిందే. వాస్తు పండితుల సూచనల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. అవసరాలకు అనుగుణంగా వాడుకునేందుకు నార్త్‌వెస్ట్(వాయవ్య) సిబ్బంది, అధికారుల రాకపోకల కోసం నార్త్ఈస్ట్(ఈశాన్యం), సందర్శకుల కోసం సౌత్ఈస్ట్(ఆగ్నేయం), అలాగే సీఎం, సీఎస్ సహా వీవీఐపీలకు తూర్పు గేటు(మెయిన్)ను ఏర్పాటుచేశారు.