హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: దూర విద్యకు చుక్కానిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిలుస్తున్నదని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుసుంబ సీతారామారావు తెలిపారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 6న నిర్వహించే వర్సిటీ 24వ సాత్నకోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హాజరవుతారని చెప్పారు. కెనడాలోని కామన్వెల్త్ ఆఫ్ లర్నింగ్ అధ్యక్షుడు, సీఈవో ప్రొఫెసర్ ఆషా కన్వర్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
నూతన కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం వర్సిటీ అనేక మైలురాళ్లను అధిగమించిందని తెలిపారు. 2019-21లో బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తిచేసిన మొత్తం 94,206 మంది విద్యార్థులకు పట్టాలతో పాటు ప్రతిభ కనబర్చిన వారికి బంగారు పతకాలు, బుక్ ప్రైజ్‌లను అందజేస్తామని వెల్లడించారు. 492 మంది ఖైదీలు పట్టాలు తీసుకోనున్నారని, ఇందులో ముగ్గురికి బుక్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. వర్సిటీ పరిపాలనా విభాగం, సిబ్బంది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు వీసీ సీతారామారావు పేర్కొన్నారు.