రామాయణాన్ని రచించి మానవాళికి కుటుంబ వ్యవస్థను పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షిని తమ జాతి మూలపురుషుడిగా నిత్యం ఆరాధించే వాల్మీకిబోయలు ఒకప్పుడు ఎస్టీలు (షెడ్యుల్ తెగలు). కానీ, అగ్రవర్ణ రాజకీయ నాయకులు కుట్రలు చేసి వారిని బీసీ జాబితాలో చేర్చారు. ఫలితంగా వాల్మీకి బోయలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటుకు గురయ్యారు. ప్రభుత్వ ఫలాలు కూడా అందకపోవడంతోపాటు పట్టణ ప్రాంతాలకు వలసపోయి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాలుగా తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాడుతూనే ఉన్నారు. ఒకప్పుడు దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆంగ్లేయులపై వీరోచిత పోరాటం చేసి సి.టి. యాక్ట్‌కు గురైన వాల్మీకి బోయలం స్వతంత్ర భారతదేశంలోనూ నిరాదరణకు గురవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వాల్మీకి బోయలు దశాబ్దాల ఆకాంక్ష మాత్రం నెరవేరడం లేదు.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. దాన్ని కేంద్రప్రభుత్వానికీ పంపించింది. కానీ, కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఆ బిల్లుపై స్పష్టమైన వైఖరిని తెలుపలేదు. వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చింది. ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తామని ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభల్లో, ఇతర సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ, ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. వారి న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలి.