హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యా క్టరీ ఏర్పాటు చేయాలని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీయే అడుగుతున్నదని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారని, లేఖలు సైతం రాశారని గుర్తుచేశారు. మాజీ ఎంపీలు వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవితతో కలిసి ప్రధాని, కేంద్రమంత్రులకు వినతిపత్రాలు అందజేసినట్టు తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోచ్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వం 160 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయటంతోపాటు 60శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వీనివైష్ణవ్ను కలిసి విన్నవించినట్టు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.
అక్కడో తీరు..ఇక్కడో తీరా?
మోదీ-అదానీ టీషర్ట్‌లతో రాహుల్‌గాంధీ పార్లమెంటుకు వచ్చారని వద్దిరాజు రవిచంద్ర గుర్తుచేశారు. తెలంగాణలో రేవంత్-అదానీ టీషర్ట్‌లతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకపోవడం దుర్మార్గమని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక విధంగా.. వారి పాలిత రాష్ర్టాల్లో నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నదని ఆయన ఆరోపించారు.