కరీంనగర్ : జిల్లాలో కొవిడ్ నియంత్రణకు 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని మాతా శిశు సంరక్షన కేంద్రంలో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమవారం నుంచి జిల్లాలో 15 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో మొత్తం 26 సెంటర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
జిల్లాలో 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల 64 వేల మంది యువతను గుర్తించామని, వారందరికి కొవాగ్జిన్ కరోనా టీకా మొదటి డోస్ వేయాలని వైద్య సిబ్బందిని మంత్రి ఆదేశించారు.
28 రోజుల తర్వాత తిరిగి రెండో డోస్ వేయాలని అన్నారు. గుర్తించిన వారందరికి కరోనా టీకా వేయించుటకు తల్లిదండ్రులు, గురుకుల పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలని సూచించారు.
గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కొవిడ్ టీకా వేయించేందుకు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపిని అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. కొవిడ్ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోలన్నారు.
అనంతరం మంత్రి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశ నిర్వహించి కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా బాలింతలకు కేసిఆర్ కిట్ ను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, నగర మేయర్ వై.సునీల్ రావు, కార్పొరేటర్లు డిండిగాల మహేశ్, సరెల్ల ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్.ఎం.ఓ డాక్టర్ జ్యోతి, మాత శిశు సంరక్షణ కేంద్రం పరిపాలన అధికారి డాక్టర్ అలీం, తదితరులు పాల్గొన్నారు.