ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి 15 నుంచి 18 పిల్లలకు, 60 ఏండ్ల సీనియర్ సిటిజన్స్,హెల్త్ కేర్ పర్సన్స్, ఫ్రంట్ లైన్ పర్సన్స్ కి కొవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ప్రారంభించారు.
కొవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కూడా టీకాలు వేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం, ముస్తఫా నగర్, వెంకటేశ్వర నగర్, శ్రీనివాస నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టీకా ను అందుబాటులో ఉంచామన్నారు.
వీటితో పాటు ఉమెన్స్ కాలేజీ, గాంధీ చౌక్, ప్రభుత్వ పీజీ కాలేజీ ఎన్టీఆర్ సర్కిల్, ప్రభుత్వ ఇందిరానగర్ స్కూల్-ఇందిరానగర్, శాంతినగర్ కాలేజీ, ముస్తఫా నగర్, అంబేద్కర్ గురుకుల కాలేజీ, ఎన్ఎస్పీ క్యాంప్ నందు టీకా కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, కొవిడ్ బూస్టర్ డోస్ లు వేసుకున్నారు.