హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ‘రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేటీఆర్‌కు ఉన్న అభిరుచి, అంకితభావం మరెవరిలోనూ కనిపించదు. రాజకీయాల్లోకి రావాలనుకొనే యువత ఆయనను చూసి నేర్చుకోవాలి’ అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుపై ఉత్తరాఖండ్ జర్నలిస్ట్ రమేశ్ భట్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఫేస్బుక్లో తాను చేసిన పోస్ట్‌ను శుక్రవారం ట్విట్టర్లో పంచుకొన్నారు. ‘నేను ఈ వ్యక్తికి పెద్ద అభిమానిని. ఎప్పుడూ కలవలేదు. కనీసం తెలియదు. కానీ నేను ప్రతిరోజూ ఆయన నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకొంటాను. ఆయనే తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతి ఒక్కరూ తమ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథాన్ని, అంకితభావాన్ని ఈయన నుంచి నేర్చుకోవాలి.
ఆయన తెలంగాణను ప్రపంచ వేదికపై మరింత మెరుగ్గా ప్రదర్శించే తీరు, సాధించిన విజయాలను వివరించే తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు. ఈ ఏడేండ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 130 శాతం (రూ.2,78,000) పెరిగింది. రాష్ట్ర జీఎస్డీపీ రూ.4.90 లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) దాదాపు 14 శాతం. ఈ విజయాలు సాధించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ది కీలకపాత్ర. రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా చేయాలనుకొనే యువతకు ఇదో గొప్ప స్ఫూర్తి. ఉత్తరాఖండ్ లాంటి రాష్ర్టాలు తమ అవకాశాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎలా ట్రాక్ చేయాలో కేటీఆర్ నుంచి నేర్చుకోవాలి.’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ జర్నలిస్ట్ రమేశ్ భట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.