హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు త్వరలోనే సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేస్తామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం కొనసాగిన విచారణకు న్యాయవాదులు, అధికార బృందంతో కలిసి మంత్రి హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం మంత్రి స్థానిక మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూచనల మేరకు వెనక్కి తీసుకున్నామని, త్వరలోనే ప్రాజెక్టుపై సివిల్ సూట్ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు భంగం కలుగకుండా పోరాడుతామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నల్లమలసాగర్ ప్రాజెక్టును ప్రతి ఫోరమ్‌లోనూ అడ్డుకుంటామని మంత్రి తెలిపారు.