హైదరాబాద్, ఆగస్టు22 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుతోపాటు, జలవివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన అధికారుల కమిటీపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయ సమాచారం. తనతో చర్చించకుండా అధికారుల పేర్లను ఎలా ప్రతిపాదిస్తారని నిలదీసినట్టు తెలిసింది. ఆ ప్రతిపాదనలను ఉత్తమ్ పక్కన పెట్టినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఏపీ సర్కారు బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిన నేపథ్యంలో.. ఇటీవల కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా ఇరు రాష్ర్టాల సీఎంలు భేటీ అయ్యారు. జలవివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని ఇరు రాష్ర్టాలు అంగీకారానికి వచ్చారు.
కేంద్రం సూచనతో అధికారుల పేర్లపై ఇరిగేషన్ శాఖ కసరత్తు చేసింది. అందులో భాగంగా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, జలవనరుల ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంటర్‌స్టేట్ వాటర్ విభాగం ఎస్ఈ సల్లా విజయ్‌కుమార్ పేర్లను ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ఫైల్‌ను అధికారులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తాజాగా సమర్పించినట్టు తెలిసింది. ఆ ప్రతిపాదనలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. కమిటీ కోసం పేర్లను ఎవరు ప్రతిపాదించమన్నారు? ఏ ఉద్దేశంతో ప్రతిపాదనలను పంపారు? అంటూ సిబ్బందిపై నిప్పులు చెరిగినట్టు తెలుస్తున్నది.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రం తరఫున పేర్లను కమిటీకి ప్రతిపాదించింది. తెలంగాణ సైతం అధికారుల పేర్లను పంపితే త్వరలోనే కేంద్ర జల్‌శక్తి శాఖ కమిటీని ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్లను ప్రతిపాదించడంపై మంత్రి ఉత్తమ్ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. చర్చించకుండానే కమిటీ కోసం అధికారుల పేర్లను ప్రతిపాదించడాన్ని తప్పుబడుతున్నారా? లేదంటే మొత్తంగా కమిటీ కోసం సుముఖత వ్యక్తం చేయడాన్నే వ్యతిరేకిస్తున్నారా? అనేది తెలియక ఇరిగేషన్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.