Crime news : ఆదిలాబాద్‌లో కలకలం రేపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ హత్య కేసును ఉట్నూర్ పోలీసులు చేధించారు. వివాహేతర బంధమే ఆయన హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. తన ప్రియుడితో వివాహేతరం బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. కిరాయి గూండాలకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వారు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలంలోని నాగలకొండ హత్యకు గురైన గజేందర్ (32) స్వగ్రామం. అయితే జైనథ్ మండలంలోని మేడిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అదిలాబాద్ పట్టణంలోని రామ్‌నగర్ ఏరియాలో కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు. గజేందర్‌కు భార్య విజయలక్ష్మితోపాటు ఒక కుమారుడు ఉన్నాడు. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి ఆయన స్వగ్రామానికి వెళ్లాడు.
కాగా గజేందర్ భార్య విజయలక్ష్మి నిజామాబాద్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో తన క్లాస్మేట్ మహేష్‌తో ప్రేమలో పడింది. కానీ 2017లో తల్లిదండ్రులు ఆమెను ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేంద్రకు ఇచ్చి వివాహం చేశారు. అయినా ఆమె మహేష్‌తో వివాహేతర బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ విషయం గజేందర్‌కు తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. దాంతో పెద్దలు ఒప్పించి ఇద్దరికీ బుద్ధిగా కాపురం చేసుకోవాలని చెప్పారు. కానీ విజయలక్ష్మి తన వివాహేతర బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని కోపం పెంచుకుంది.
ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. అందుకోసం బేల ప్రాంతానికి చెందిన కిరాయి రౌడీలు బోడె సుశీల్, ఉరువేత కృష్ణను సంప్రదించారు. గజేందర్‌ను హత్య చేస్తే ఇద్దరికీ మూడు లక్షల చొప్పున సుపారి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో వేసవి సెలవులు ముగిశాయి. భర్త ఆదిలాబాద్‌కు రాకుండా ఈ నెల 12న స్వగ్రామం నుంచే పాఠశాలకు బైకుపై బయలుదేరాడు. ఈ విషయం ముందే తెలిసిన భార్య కిరాయి హంతకులకు సమాచారం ఇచ్చింది.
దాంతో కిరాయి హంతకులు ఉరువేత్త కృష్ణ, బోడే సుశీల్‌లు ఈ నెల 12న పాఠశాలకు వెళ్తున్న గజేందర్‌ను అనుసరించారు. గాదిగూడ మండలం అర్జుని గ్రామం వద్ద గజేందర్ మోటార్ సైకిల్‌ను వెనుక నుంచి ఢీ కొట్టారు. దాంతో కింద పడిపోయిన గజేందర్‌ను రోడ్డు పక్కన కోపులోకి ఈడ్చుకెళ్లి బండరాళ్లతో తలపై మోది దారుణంగా హత్య చేశారు. కేసును వేగంగా చేధించిన ఉట్నూర్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం నలుగురు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు.