ఊర్కొండ, జూలై 21 : నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేటలో నెలకొన్న విద్యుత్తు సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తమకు ఏనాడూ విద్యుత్తు సమస్యలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమస్యలు తారస్థాయికి చేరాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామస్థులు, రైతులు ఈనెల 18న జకినాలపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.
‘సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన’ పేరిట ఈ నెల 19న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి.. ఊర్కొండపేట గ్రామంలో విద్యుత్తు సమస్యను పరిష్కరించేందుకు సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు గ్రామస్థులకు హామీ ఇచ్చారు. తమ గ్రామ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి, పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.