హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): దేశంలోని పట్టణ, నగర సమస్యలకు వినూత్న పరిషారాలను యువత(డిగ్రీ, పీజీ విద్యార్థులు) కనుగొనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘అర్బన్ ఎక్స్ చాలెంజ్ ఐడియాథాన్’కు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్(ఎంఏయూడీ) విభాగం కార్యదర్శి టీఏ శ్రీదేవి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఎంఏయూడీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎం)లోని అర్బన్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్(యూఐఐసీ) ఆధ్వర్యంలో ఈ ఐడియాథాన్‌ను ప్రారంభించినట్టు ఆమె తెలిపారు. యువతలో సృజనాత్మకత, సమస్య పరిషార నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా మన నగరాలను మరింత సుస్థిరంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాల డిగ్రీ, పీజీ విద్యార్థులతో పాటు స్టార్టప్‌లు కూడా ఇందులో పాల్గొనవచ్చని చెప్పారు. నగరాల్లో వ్యర్థాల నిర్వహణ, పట్టణ రవాణా, వాతావరణ మార్పులు, నీటి నిర్వహణ, స్మార్ట్ గవర్నెన్స్, సమగ్ర పట్టణ అభివృద్ధి వంటి అంశాలపై కొత్త ఆలోచనలు పంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమ ఆలోచనలను ఈ నెల 20లోగా సమర్పించాలని, ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలు, దరఖాస్తు కోసం అధికారిక వెబ్సైట్ www.nium.org.in ను సందర్శించవచ్చని తెలిపారు. టాప్-3 ఆలోచన ఇచ్చిన విజేతలకు నగదు బహుమతులు ఉంటాయని, సర్టిఫికెట్లు, మెంటార్షిప్, ఇంక్యుబేషన్ సహాయం అందిస్తామని పేర్కొన్నారు.