గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 16:41:11

సీఎం స‌హాయ‌నిధికి ఉప్ప‌ల శ్రీనివాస్ రూ. 10 ల‌క్ష‌లు విరాళం

సీఎం స‌హాయ‌నిధికి ఉప్ప‌ల శ్రీనివాస్ రూ. 10 ల‌క్ష‌లు విరాళం

హైద‌రాబాద్ : అకాల వరదలతో అత‌లాకుత‌ల‌మైన‌ హైదరాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ ముందుకువచ్చారు. భార్య ఉప్పల స్వప్న, కుమారులు సాయి కిరణ్, సాయి తేజలతో కలిసి ఉప్పల ఫౌండేషన్ తరపున మంత్రి కేటీఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 ల‌క్ష‌ల విరాళం అందించారు.

కేటీఆర్‌ను కలిసిన అనంతరం ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారీ వరదలు ప్రజల జీవితాలను అత‌లాకుత‌లం చేశాయ‌న్నారు. తక్షణ ఉపశమనం కోసం సీఎం కేసీఆర్ రూ. 550 కోట్లు విడుదల చేయడం గొప్ప విషయమన్నారు. ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు. తనవంతు బాధ్యతగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు అందించాన‌ని పేర్కొన్నారు.

ఉప్పల ఫౌండేషన్ తరపున గతంలోనూ ఉప్పల శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పల ఫౌండేషన్ నుంచి వివాహాలు చేసుకునే ఆడ బిడ్డలకు బంగారు పుస్తెలు, వెండి మెట్టెలు అందిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వేలమందికి అన్నదానం చేశారు. ఎంతోమందికి నిత్యావసరాలు అందజేశారు. జర్నలిస్టులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానంతోపాటు నిత్యావసరాలు, కరోనా కిట్లు అందజేశారు.