హైదరాబాద్ : తెలంగాణలో పర్యటిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బృందం తెలంగాణకు హరితహారం పనులను పరిశీలించడంతో పాటు వివిధ జిల్లాల్లో పర్యటించి హరితహారం ఫలాలను స్వయంగా పరిశీలించింది. ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ నేతృతంలోని బృందం మేడ్చల్ మల్కాజ్ గిరి, సిద్ధిపేట జిల్లాల్లో పర్యటించారు. అటవీ పునరుద్ధరణ, పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్క్ (కండ్లకోయ ఆక్సీజన్ పార్క్), ఔటర్ రింగ్ రోడ్ లో పచ్చదనం యూపీ బృందం పరిశీలించింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జప్తి సింగాయిపల్లి నర్సరీ, ములుగు నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఫారెస్ట్ మినిస్టర్ అరుణ్ కుమార్, తెలంగాణ అటవీశాఖ అధికారులు, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, సలహాదారు ఆర్ శోభతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అడవుల పెంపుదల, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు చాలా బాగున్నాయని అన్నారు. పచ్చదనం పెంపుదలలో పంచాయతీ, ప్రజలు భాగస్వామ్యమయ్యారని పేర్కొన్నారు. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోందన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులు, పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి చాలా ప్రశంసనీయమని అన్నారు. పర్యటనలో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపుదలపై చాలా విషయాలు గ్రహించినట్లు అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఆశ, డీఎఫ్వో శ్రీధర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.