Telangana | హైదరాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): తెల్లబంగారాన్ని పండిస్తున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆందోళనలోకి నెట్టేసింది. ఓ వైపు పత్తి పంట చేతికొస్తున్నా, సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టకపోవడం ఇందుకు కారణమవుతున్నది. బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు పడిపోవడం రైతాంగాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. ప్రభుత్వ పట్టింపులేనితనంతో దళారులు ‘ఆడిందే ఆట పాడిందే పాట’ అన్నచందంగా పరిస్థితి తయారైంది. ఈ సీజన్లో రాష్ట్రంలో 42.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 25.33 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నరు.
ఎగుమతులు తగ్గి..‘మద్దతు’ కరువు
ప్రస్తుతం మార్కెట్లో పొడవురకం గింజ పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.7521, మధ్యరకం గింజకు రూ.7121 దర ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పడిపోవడం, మన పత్తికి ప్రధాన మార్కెటైన బంగ్లాదేశ్లో అల్లర్లు, చైనా, వియత్నాం, పాకిస్థాన్లో నెలకొన్న పరిస్థితులు, ఇతర దేశాల్లో యుద్ధ వాతావరణం పత్తి ధరపై ప్రభావం చూపుతున్నాయి. దీన్నే అదనుగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కన్నా తక్కువగా రూ. 6500 నుంచి రూ. 7వేల వరకు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాలుకు సగటున రూ. 500 నుంచి రూ. వెయ్యి వరకు నష్టపోతున్నారు.
సాఫ్ట్వేర్ లేదు.. మిల్లులతో ఒప్పందాల్లేవ్..
వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పత్తి పంట కోతలు మొదలయ్యాయి. వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కోతలు వేగం కానున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోళ్లపై చర్యలు తీసుకోలేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఇప్పటి వరకు జిన్నింగ్ మిల్లులతోనూ ఒప్పందం పూర్తికాలేదు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినా ఇప్పటి వరకు ఎక్కడా ఒప్పందాలు జరగలేదు. ఇప్పటివరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదు. కేజీ పత్తి కొనలేదు. మరోవైపు తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఒప్పందాలు చేసుకోబోమని జిన్నింగ్ మిల్లుల యజమానులు బెట్టుజేశారు. ఇటీవల వ్యవసాయ శాఖ రంగంలోకి దిగి చర్చలు జరపడంతో ఒప్పుకున్నారు. రాష్ట్రంలో 351 జిన్నింగ్ మిల్లులు ఉండగా, 319 మిల్లులు మాత్రమే కొనుగోళ్లు చేపట్టేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం.
రంగు మారితే..?
గతనెలలో కురిసిన వర్షాలతో పత్తి పంట దెబ్బతిన్నది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో పత్తి రైతు కుదేలయ్యాడు. వానల నేపథ్యంలో రంగు మారిన పత్తిని ప్రభుత్వం కొంటుందా.. లేదా అనేది అనుమానంగానే ఉంది. మరోవైపు సీసీఐ మాత్రం రంగుమారిన పత్తిని కొనేది లేదని తేల్చిచెప్పింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని రైతన్నలు ఎదురు చూస్తున్నారు. తేమ 8శాతం ఉంటేనే మద్దతు ధర లభిస్తుందని సీసీఐ చెబుతుండగా, ఎక్కువ ఉంటే మాత్రం కోతలు తప్పేలా లేవు. ఒక్కో శాతం తేమకు మద్దతు ధరలో ఒక్కోశాతం కోత పెట్టనున్నట్టు తెలుస్తున్నది.