హైదరాబాద్ : ఆకలి, పోషకాహార లోపం సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమ బృందం ప్రశంసించింది. భారత్ నుంచి ఆకలి, పోషకాహారలోపం సమస్యలను పారదోలడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, ఎన్జీవోలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం భారత డైరెక్టర్ బిషో పారాజులి అన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితతో ఆహార కార్యక్రమం బృందం గురువారం వర్చువల్ మీటింగ్ లో మాట్లాడింది. పోషకాహార లోపంపై కౌమార బాలికల్లో అవగాహన కోసం ఎమ్మెల్సీ కవిత తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతలు, గర్భిణీలతో పాటు సహాయకులకు కూడా పౌష్టికాహారాన్ని అందించడం గొప్ప విషయమని బిషో పారాజులి అన్నారు. తమతో కలిసి పనిచేయాలని తెలంగాణ జాగృతికి ఆహ్వానం అందించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కరోనా ఆపత్కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అన్నపూర్ణ కేంద్రాలతో పేదలకు ఉచితంగా అందిస్తున్న భోజనం గురించి చెప్పారు. దీంతో పాటు వలస కూలీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకులతో కలిగిన ప్రయోజనాలను తెలిపారు. మహిళలు, బాలికల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచ ఆహార కార్యక్రమం బృందానికి కవిత వివరించారు.
ఐక్యరాజ్య సమితికి (UNO) చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంస్థ. ఆకలి సమస్యను ఎదుర్కోవడం, ఆహార భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ సంస్థ విశేష సేవలందిస్తోంది. పేద దేశాలతో పాటు యుద్ద ప్రాంతాల్లో ఈ సంస్థ వెలకట్టలేని సేవలు చేస్తోంది. ఈ సంస్థ సేవలకు 2020లో నోబెల్ శాంతి పురస్కారం సైతం దక్కింది.
Had a great meeting with @BishowParajuli (Country Head, World Food Program) and the @WFP team (Winner of the 2020 #NobelPeacePrize) & discussed various issues, approaches, & policies to address issues of hunger & malnutrition, especially among women & children. #EndHunger pic.twitter.com/Uj28hpJq1g
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 27, 2021