Telangana | అక్కన్నపేట, సెప్టెంబర్ 30: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామంలోని బురుజు చౌరస్తా వద్ద నిరుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో విగ్రహావిష్కరణ చేయాల్సి ఉంది. ఇంతలోనే గుర్తు తెలియని దుండగులు విగ్రహంపై కప్పి ఉంచిన ముసుగుకు నిప్పంటించారు. దీంతో విగ్రహం పాక్షికంగా కాలిపోయింది.
సోమవారం ఉదయం స్థానిక బీఆర్ఎస్ నాయకులు గద్దల రమేశ్, గంగాధరి రాజయ్య, వెల్ది రంగారావు గమనించి మాజీ ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్, మాజీ జడ్పీటీసీ భూక్య మంగ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు సహా ముఖ్య నాయకులకు సమాచారం అందించారు. విగ్రహం దగ్గరికి చేరుకున్న నాయకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి ఆ తర్వాత క్షీరాభిషేకం చేశారు. అనంతరం విగ్రహంపై మళ్లీ ముసుగు వేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నాయకులు.. తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.