హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(బీఆర్‌ఏవోయూ)లో పదెకరాల స్థలాన్ని ప్రభుత్వం జేఎన్ఎఫ్ఏయూకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడిన ఉద్యోగ సంఘాలు బుధవారం వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పల్లవి కాబడే, కన్వీనర్ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జీ మహేశ్వర్‌గౌడ్ మాట్లాడారు. తమ వర్సిటీ స్థలాన్ని ప్రభుత్వాలు ధారాదత్తం చేయడం తగదని వారు హితవు పలికారు. వర్సిటీకి కేటాయించిన 53 ఎకరాల్లో టీశాట్‌కు 5, కేబుల్ బ్రిడ్జికి 4 ఎకరాల చొప్పున కేటాయించారని, మరో 5 ఎకరాల స్థలం దుర్గంచెరువు నీట మునిగిందని తెలిపారు. వర్సిటీలో ఇంకా మల్టిమీడియా, ఆన్లైన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ భవనాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నిర్మించాల్సి ఉన్నదని చెప్పారు. సరైన వసతులు లేక అధ్యాపకులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, ఈ దశలో పదెకరాల స్థలాన్ని జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు కేటాయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. స్థల కేటాయింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే వచ్చేరోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో జేఏసీ నాయకులు రవీంద్రనాథ్, వెంకటేశ్వర్లు, నారాయణరావు, బానోత్ ధర్మ, ఎం రేషేంద్రమని, పుష్పా చక్రపాణి, మాధురి, మేరి సునంద, పీ వెంకటరమణ, ఎల్వీకే రెడ్డి, హబీబుద్దీన్, కాంతం ప్రేమ్‌కుమార్, యాకేష్ దైద, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.