హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): వాయుసేన అమ్ములపొదిలో మరో అద్భుత ఆయుధం చేరింది. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘అస్త్ర’ మిస్సైల్‌ను రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఆదివారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అప్పగించారు. గగనతలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే ఈ క్షిపణి 100 కి.మీపైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీంతో ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను రూపొందించగలిగే దేశాల సరసన భారత్ నిలిచిందని మంత్రి అజయ్ భట్ హర్షం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో దేశ ఎగుమతులు వృద్ధి చెందేందుకు ‘అస్త్ర’ లాంటి ఆయుధాలు దోహదం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో బీడీఎల్ సీఎండీ ఏ మాధవరావు, డీఆర్డీవో డీజీఎంఎస్ఎస్ యూ రాజాబాబు, డైరెక్టర్ ఎన్ శ్రీనివాసులు(ఫైనాన్స్), పీవీ రాజారామ్ (ప్రొడక్షన్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ఉపేందర్ వెన్నం తదితరులు పాల్గొన్నారు.
కొత్త క్షిపణుల పరీశీలన
హైదరాబాద్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో గల రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ)ను కేంద్ర మంత్రి అజయ్ భట్ సందర్శించారు. అక్కడ తయారవుతున్న అగ్ని ప్రైమ్, ఆకాశ్-ఎన్జీ, ప్రళయ్ క్షిపణులను క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్రవేత్తలను అభినందించారు. ఆర్సీఐలో కొత్తగా రూపొందిస్తున్న క్షిపణులు, ఇతర ఆయుధాల గురించి అధికారులు ఆయనకు వివరించారు.