కేసముద్రం, డిసెంబర్ 26: ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్రెడ్డి జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులను తరలించారు. వారిని ముందు వరుసలో కూర్చోబెట్టి కేక్ కట్ చేశారు. పటాకులు కాల్చి పైకి ఎత్తాల్సి ఉండగా, ఎదురుగా ఉన్న విద్యార్థులపైకి ఎత్తడంతో బాలికలపై నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి.
విద్యార్థులు బెంబేలెత్తిపోయి ఒకరిపై మరొకరు నెట్టుకుంటూ దూరం వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రమా దం జరగకపోయినా, పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం తప్పింది. అయితే ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను ఆహ్వానించడంపై పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమవుతున్నది. ప్రైవేటుగా నిర్వహించే జన్మదిన కార్యక్రమాలకు విద్యార్థులను రప్పించడంతోపాటు వారిని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం జరుగడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది.