హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఏ దర్యాప్తు సంస్థలు వచ్చినా స్వాగతించి మర్యాద చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఫార్ములా ఈ-రేస్ విషయంలో అవినీతి జరిగిందని, కేసులు, అరెస్టుల భయంతో కేటీఆర్ మలేషియాకు చెప్పాపెట్టకుండా పారిపోయాడని సీఎం రేవంత్‌రెడ్డి అనుకూల మీడియా చేసిన దుష్ప్రచారంపై ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ముందుగా మీకు (రేవంత్‌రెడ్డి అనుముల) పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. మీ సంస్థలు ఎప్పుడు వచ్చినా స్వాగతం.. చాయ్, ఉస్మానియా బిస్కెట్లతో మర్యాద చేస్తా.. ఆ సంస్థలు మీ పుట్టిన రోజు కేక్ కట్ చేయాలనుకుంటే తెప్పిస్తా..’ అంటూ స్పష్టంచేశారు. ‘నా అరె స్టు కోసం ఉవ్విళ్లూరుతు న్న రేవంత్‌రెడ్డికి సుంకిశాల ఘటనలో మేఘా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్ చేసే దమ్ముందా.. మే ఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా?’ అని నిలదీశారు. ‘ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ను.. తన ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసివేసే దమ్ముం దా?.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా?’ అని నిప్పులు చెరిగారు.
ముఠా పద్మకు కేటీఆర్ పరామర్శ
వెన్నెముక సర్జరీ అనంతరం కోలుకుంటున్న మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ముఠా పద్మను ముషీరాబాద్‌లోని ఆమె స్వగృహంలో కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కాగా కేటీఆర్ మలేషియా వెళ్లాడని దుష్ప్రచారం కావడంపై బీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు భగ్గుమన్నారు. మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ ఇల్లు మలేషియాలో ఉన్నదా? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.