Telangana | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని విద్యార్థి నాయకుడు జంగయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10,954 జిపిఓ పోస్టులను నేరుగా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. 10,954 జీపీవో (గ్రామ పాలన ఆఫీసర్) పోస్టులను పాత వీఆర్వో, వీఆర్ఏలతో భర్తీ చేయడంతో రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వారిలో చాలా మంది పదవ తరగతి, ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వారే ఉన్నారని గుర్తు చేశారు. కనీసం డిగ్రీ అర్హత ఉన్న వారిని మాత్రమే తీసుకుని మిగతా ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. తద్వారా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
129 జీవో ప్రకారం ఆప్షన్లు ఇచ్చిన 6120 పైచిలుకు పాత వీఆర్వో, వీఆర్ఏలకు స్క్రూట్నీ పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వారికి టీజీపీఎస్సీ ద్వారా వంద మార్కులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే జీపీవోలుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగిలిన ఖాళీలకు వచ్చే నెల రెండవ తేదీలోపు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రామకృష్ణ, రమేష్ గౌడ్, మధు, సైదులు, వెంకటేష్, మల్లేశం, వీరేశలింగం తదితరులు పాల్గొన్నారు.