హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మరోసారి ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని, పాత జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేసి, కొత్త క్యాలెండర్‌ను ప్రకటించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యేకంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ప్రతిపాదించిన పోస్టులను 20 వేలకు పెంచాలని పోలీసు ఉద్యోగార్థులు పట్టుబడుతున్నారు. ఈ అంశంపై జూన్‌లోనే నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించింది. అయితే, ప్రభుత్వం 7,437 పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడంతో పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి లక్షలాదిగా నిరుద్యోగులు తరలిరావాలని నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది.
నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లలో జాబ్ క్యాలెండర్ ఒకటి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు వాటిని గుర్తించి, ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు? ఎప్పుడు ఫలితాలు ప్రకటిస్తారు? ఎప్పుడు నియామకాలు చేపడుతారు? అనే అంశాలపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నోటిఫికేషన్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూసే పరిస్థితికి ముగింపు పలకాలని, ప్రతి సంవత్సరం ఖాళీలను గుర్తించి, నిర్ణీత సమయంలో నియామకాలు చేపట్టాలని నినదిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అపహాస్యంగా మారడం, దాని ప్రకారం ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు అసహనంతో ఉన్నారు. అందుకే గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేసి ఖాళీలకు అనుగుణంగా వాస్తవికమైన కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతున్నారు.
ఉద్యోగం లభించే వరకూ నిరుద్యోగులకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని నిరుద్యోగ జేఏసీ గుర్తు చేస్తున్నది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న ఎన్నికల హామీని అమలుచేయలేదని విమర్శిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యమవుతుండటంతో కోచింగ్ ఫీజులు, హాస్టల్ వసతి, ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, పరీక్ష ఫీజులు వంటి ఖర్చులు భరించలేక అనేక మంది అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షలాదిమంది నిరుద్యోగులకు ఏడువేల పోలీసు పోస్టులు సరిపోవని, 20వేల పోస్టులతో నోటిఫికేషన్ సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో జూన్ 29న హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. తాజాగా సోమవారం అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపుతో.. పోలీసు శాఖ అప్రమత్తమైంది. భారీగా బలగాలను మోహరించింది.