హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్‌లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధించిన దర్యాప్తు ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఎలక్ట్రోరల్ రెసిస్టివిటీ మెథడ్(ఈఆర్ఎం)ను ఉపయోగించి భూగర్భ పరీక్షలను నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ) 7 బ్లాక్‌లోని 20 పిల్లర్ గత అక్టోబర్‌లో కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. అందుకు గల కారణాలు తెలుసుకొనేందుకు ఇంజినీరింగ్ అధికారులు దృష్టి సారించారు. ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను కూడా బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ఎల్అండ్టీ చేపట్టింది. కుంగుబాటుకు గురైన ప్రాంతంలో 60 హెచ్‌పీ మోటర్లను పెట్టి నీటిని తోడేస్తున్నది. గురువారం ఉదయం నాటికి బరాజ్ బెడ్ లెవల్ వరకు నీటిని తొలగించినట్టు సమాచారం. బరాజ్ కుంగుబాటుకు గల కారణాలను తెలుసుకునేందుకు ఎల్అండ్టీ.. మరో కంపెనీతో ప్రాథమిక పరీక్షలు చేయిస్తున్నది. తొలుత కుంగుబాటుకు గురైన 7వ బ్లాక్ వద్ద పరీక్షలు నిర్వహించి, తదుపరి అన్ని బ్లాక్‌లలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
ఈఆర్ఎం అంటే..
బరాజ్ కుంగుబాటుకు కారణాలను తెలుసుకునేందుకు ఈఆర్ఎంను ఉపయోగిస్తున్నారు. విద్యుత్తు నిరోధకత ఆధారంగా భూగర్భ పరీక్షలను నిర్వహిస్తారు. విద్యుత్తు ప్రవాహం అన్నింట్లో ఒకేలా ఉండదు. ఇసుకలో, నీళ్లలో, ఒక్కో రకం పదార్థంలో ఒక్కో తీరుగా, ఒక్కో వేగంతో ప్రవహిస్తుంది. ఇలా విద్యుత్తు ప్రవాహాన్ని బట్టి భూగర్భంలో ఎలాంటి పదార్థం ఉన్నదో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఇదే పద్ధతిని అనుసరించి బరాజ్ పునాదిని అధికారులు పరీక్షిస్తున్నారు. పునాది కింద భూగర్భంలో వచ్చిన మార్పులను అంచనా వేయనున్నారు. మొత్తంగా ఈ ప్రక్రియ వారం పాటు కొనసాగనున్నదని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పరీక్ష ఫలితాల అనంతరం పునాదిని తెరిచే అవకాశం ఉన్నది.
సుందిళ్లలో లీకేజీలు బంద్
మేడిగడ్డ ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా పలు చోట్ల లీకేజీలు ఏర్పడిన విషయం తెలిసిందే. సుందిళ్లలో రెండు చోట్ల, అన్నారంలో నాలుగు చోట్ల లీకేజీలు బయటపడ్డాయి. ఇప్పటికే అక్కడ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించిన బాధ్యతలను ఇప్పటికే డైనోసర్ అనే కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టింది. సుందిళ్లలో రెండు చోట్ల ఏర్పడిన లీకేజీలను విజయవంతంగా అరికట్టింది. గ్రౌటింగ్ పూర్తి చేసింది. అన్నారంలోనూ గ్రౌటింగ్ పూర్తి చేసింది. అయితే లీకేజీలకు గల కారణాలను తెలుసుకునేందుకు ఈ బరాజ్‌ల వద్ద దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతున్నది.