కురవి, జూలై 6 : మనుమడి మృతిని తట్టుకోలేక అమ్మమ్మ మరణించిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన బుర్ర జగదాంబ కుమారుడు శ్రీకాంత్(35) విద్యుత్తు శాఖలో తాత్కాలిక కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మరమ్మతుల కోసం ఇటీవల విద్యుత్తు స్తంభం ఎక్కగా కరంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. కేసముద్రం మండలం ఉప్పరపల్లికి చెందిన తండా బుచ్చమ్మ(85) తన బిడ్డ బుర్ర జగదాంబ ఇంటి వద్ద గత ఐదేండ్లుగా ఉంటున్నది. ఈ క్రమంలోనే మనుమడు శ్రీకాంత్ మృతిచెందిన విషయం తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించింది. శ్రీకాంత్ మృతదేహాన్ని ఏరియా దవాఖానకు పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ క్షణం నుంచి తీవ్ర మనోవేదనకు గురైన బుచ్చమ్మ ఆదివారం కన్నుమూసింది. బుచ్చమ్మ, శ్రీకాంత్ అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించగా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.