Gadwal | గద్వాల అర్బన్, అక్టోబర్ 24 : చేయని తప్పునకు ఓ రాజకీయ నాయకుడు నింద మోపడంతో అవమానం భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకొంది. అప్రమత్తమైన సదరు నాయకుడు బాలిక ప్రాణానికి ఖరీదు కట్టాడు. వివరాలిలా.. మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన వడ్డె కవిత కూతురు వడ్డె రాజేశ్వరి(16) గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ రాజకీయ నేత ఇంట్లో పని మనిషిగా ఐదేండ్లుగా పనిచేస్తున్నది. మూడు నెలల కిందట ఇంట్లో బంగారం పోయిందంటూ సదరు నేత కుటుంబ సభ్యులు హడావుడి చేసి పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను పని నుంచి తొలగించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘ఆ తర్వాత బంగారం దొరికిందంటూ ఒకసారి.. మరికొద్దిరోజులకు మొత్తం లభించలేదని, మీరే తీశారు’ అంటూ సదరు బాలిక కుటుంబీకులను హెచ్చరించారు. దీంతో దొంగతనం నింద తనపై పడటంతో అవమానంతో పదిరోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు కర్నూల్ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెం దింది. మృతిపై ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు స్పందించి ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అప్రమత్తమైన సదరు రాజకీయ నేత తన పలుకుబడితో బాలిక ప్రాణానికి ఖరీదు కట్టారు. గురువారం జిల్లా కేంద్రంలో పంచాయితీ పెట్టగా.. పలువురు రాజకీయ నాయకుల మధ్య బాలిక కుటుంబానికి రూ.1 3.50 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చినట్టు సమాచారం. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలీస్, కొందరు మీడియా ప్రతినిధులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందించినట్టు తెలిసింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా.. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.