దుబ్బాక, మార్చి 23 : సాగు కలిసి రాక.. అప్పుల భారం మోయలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. అక్బర్పేట-భూంపల్లి మండలం ఎనగుర్తికి చెందిన సిర్ర బీరయ్య(43) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటునానడు. అతనికున్న రెండెకరాల్లో వరి వేశాడు. వాగు పక్కనే పొలం ఉన్నా నీళ్లు లేక పంట ఎండిపోయింది. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.
తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆయన ఆదివారం ఉదయం 10గంటలకు పశువులకు గడ్డి తెచ్చేందుకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే చెట్టు కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బీరయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా బీరయ్య చెట్టుకు విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భూంపల్లి ఎస్సై హరికృష్ణ తెలిపారు.