హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన డ్రాఫ్ట్ రూల్స్‌ను తక్షణమే యూజీసీ ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. యూజీసీ నిబంధనలపై బీజేపీయేతర పాలిత రాష్ట్ర మంత్రులు బుధవారం బెంగళూరులో సమావేశమై చర్చించారు. రాష్ట్రం తరఫున హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో యూజీసీ సంప్రదింపులు జరపాలని తెలిపారు. నిబంధనలు రాష్ర్టాల హక్కులను హరించేలా ఉన్నాయని, వర్సిటీల్లో యూజీసీ జోక్యాన్ని సహించబోమని సమావేశంలో తీర్మానించారు.