ఏడాది చదివినా సర్టిఫికెట్ జారీ
నాలుగేండ్ల డిగ్రీకి యూజీసీ ఆమోదం
పీహెచ్డీ ప్రవేశాల్లో కీలక మార్పులు
న్యూఢిల్లీ, మార్చి 17: నచ్చినప్పుడు మెచ్చిన కోర్సులోకి మారొచ్చు. ఏడాది చదివిన తర్వాత అనివార్య కారణాలతో కోర్సును మధ్యలోనే ఆపివేస్తే అప్పటివరకూ చదివిన దానికి కూడా ధ్రువపత్రం జారీ చేస్తారు. మధ్యలో ఆపేసిన కోర్సును నచ్చిన సమయంలో తిరిగి కొనసాగించే వెసులుబాటు. నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ) సమగ్ర స్వరూపమిది. జాతీయ విద్యా విధానంలో (ఎన్ఈపీ-2020) ప్రతిపాదించిన ఎఫ్వైయూపీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు ‘కరిక్యులర్ ఫ్రేమ్‌వర్క్ అండ్ క్రెడిట్ సిస్టమ్ ఫర్ ఫోర్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్’ పేరిట డ్రాఫ్ట్ రూల్స్‌ను వెల్లడించింది. విశ్వవిద్యాలయాల వీసీలతో మార్చి 10న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టు వివరించింది. డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం.. మొదటి సంవత్సరం తర్వాత కోర్సు నుంచి తప్పుకున్న వారికి కూడా సర్టిఫికెట్ అందజేస్తారు. రెండేండ్ల కోర్సు పూర్తి చేస్తే డిప్లొమా, మూడేండ్ల కోర్సుకు బ్యాచ్లర్స్ డిగ్రీ, మొత్తం నాలుగేండ్ల కోర్సు పూర్తి చేస్తే బ్యాచ్లర్స్ డిగ్రీతోపాటు ఆనర్స్ కూడా అందజేస్తారు. నిర్ణీత క్రెడిట్స్ ఉన్న విద్యార్థులు కోర్సు సబ్జెక్టులను మార్చుకొనే అవకాశం కూడా ఉండేలా రూల్స్ పొందుపరిచారు. మధ్యలో నిలిచిపోయిన కోర్సును తిరిగి ప్రారంభించేందుకు కూడా అవకాశమిచ్చారు. 8 సెమిస్టర్లుగా ఉండే ఈ నాలుగేండ్ల డిగ్రీ కోర్సును విద్యార్థులు 160 క్రెడిట్స్ (15 గంటల క్లాస్రూమ్ అభ్యసనను ఒక క్రెడిట్‌గా తీసుకొంటారు)లో పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి రెండు సెమిస్టర్లు రిసెర్చ్ ఆధారిత సబ్జెక్టులపై ఉంటాయి.
పీహెచ్‌డీకి కొత్త పరీక్ష
పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి యూజీసీ కీలక మార్పులు చేసింది. ఇప్పటికే ఉన్న ఎన్ఈటీ/జేఆర్ఎఫ్కి అదనంగా మరో ప్రవేశ పరీక్షను చేర్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే ఎన్ఈటీ లేదా జేఆర్ఎఫ్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇన్నాళ్లు వర్సిటీలు పీహెచ్డీ ప్రవేశాలు కల్పించేవి. ఇకపై ఎన్ఈటీ/జేఆర్ఎఫ్ ద్వారా 60 శాతం సీట్లను మాత్రమే భర్తీ చేయనున్నారు. మిగిలిన 40 శాతం సీట్లను విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తాయి. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కొత్త విధానంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.