హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): అండర్ గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) స్థాయిలో ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్ కోర్సులను ఇకపై ఇంగ్లిష్ మీడియంతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ చదువుకోవచ్చు. ఈ అవకాశం త్వరలో అందుబాటులోకి రానున్నది. దీనిలో భాగంగా ఆయా కోర్సుల పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రయత్నాలను ప్రారంభించింది. 12 ప్రాంతీయ భాషల్లో ఒరిజినల్ పాఠ్యపుస్తాకాలను రాసేందుకు రచయితలు/విమర్శకులు, ఉన్నత విద్యా సంస్థల ఫ్యాకల్టీ సభ్యులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న రచయితలు ఈ నెల 30లోపు తమ సమ్మతిని తెలియజేయాలని, https:// forms.gle /cABbivfPB6hvfFhB9 గూగుల్ ఫాంలో పేర్లను నమోదు చేసుకోవాలని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ సూచించారు. విద్యార్థులు భారతీయ భాషల్లో నేర్చుకునే అవకాశాలను విస్తృతం చేయాలన్న ఎన్ఈపీ 2020 లక్ష్యానికి అనుగుణంగా డిగ్రీ పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో రూపొందిస్తున్నామని తెలిపారు.