Liquor Prices | హైదరాబాద్, జనవరి20(నమస్తే తెలంగాణ): యూబీ కంపెనీ తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిలు చెల్లింపులకు టీజీబీసీఎల్ సానుకూలంగా స్పందించిందని, తమ బ్రాండ్ ఉత్పత్తులను తెలంగాణలో విక్రయిస్తామని బీఎస్ఈ స్టాక్ ఎక్సేంజ్‌కి సోమవారం లేఖ రాసింది. అదే లేఖను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. తెలంగాణలో జనవరి 8 నుంచి తమ బ్రాండ్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు యూబీ ప్రకటించిన విషయం తెలిసిందే. యూబీ ఎందుకు ఏకపక్షంగా బీర్ల సరఫరాను నిలిపివేసిందో, మళ్లీ ఎందుకు పునరుద్ధరించిందో అర్థంచేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. బీర్ల ధరల పెంపు కోసం బేవరేజస్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కలిసే దొంగాట ఆడుతున్నారని ముందే పసిగట్టిన ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 12న ‘లిక్కర్ రేట్లపై దొంగాట’ శీర్షికన కథనం ప్రచురించింది. ‘డిస్టిలరీలు, బ్రూవరీలు, సప్లయ్ కంపెనీలు కోరిన బేసిక్ ధరలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏనాడో రంగం సిద్ధంచేసిందని, ఆరు నెలల కిందటే ఐదుగురు సభ్యులతో కూడిన ధరల నిర్ణయ కమిటీని నియమించిందని, ఆ కమిటీ నివేదిక ముఖ్యమంత్రి వద్ద ఉన్నదని, అయితే ధరల పెరుగుదలతో వచ్చే వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే అకస్మికంగా బీర్ల సరఫరా నిలివేత నాటకానికి తెరలేపారని ‘నమస్తే తెలంగాణ’ కథనం వివరించింది. అందుకు తగ్గట్టుగానే బీరు బేసిక్ ధర మీద కనీసం 19% అదనంగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది.
బీర్ల నిల్వలు అయిపోగానే..
రాష్ట్రంలో మద్యం కంపెనీలు సరఫరా నిలిపివేయడం, తీవ్రస్థాయిలో డిమాండ్ ఉన్నప్పుడు సరఫరా ఆపివేస్తామంటూ బెదిరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇదే మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేసింది. రాష్ట్రంలో టీజీబీసీఎల్ డిపోలు, బీర్ల కంపెనీల గోదాములు, మద్యం దుకాణాల్లో కలిపి 20 లక్షల కేసుల బీరు అందుబాటులో ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు లెక్కలుకట్టారు. రాష్ట్రంలో రోజుకు సగటున లక్ష కేసుల బీర్ల వినియోగం జరుగుతున్నది. ఇది చలికాలం కాబట్టి బీర్ల వినియోగ డిమాండ్ తక్కువగానే ఉంటుందని ముందుగానే అంచనా వేశారు. బీర్ల నిల్వలు అయిపోయేంతవరకు కంపెనీ, ప్రభుత్వం డ్రామాను రక్తికట్టించాయి. బీర్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో కంపెనీలో మొలాసిస్ నిల్వలు భారీగా పెరిగిపోయాయి. ఒకవైపు గోదాముల్లో బీర్ల నిల్వలు తరిగిపోవడం, మరోవైపు బేవరేజీల్లో మొలాసిస్ నిల్వలు పెరిగిపోవడం, మరోవైపు స్టాక్మార్కెట్లో కంపెనీ షేర్ల విలువలు పతనం కావడంతో మద్యం రేట్ల ఫిక్సింగ్ ఆటకు తెరపడిందని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు.
19% పెంపుదలకు గ్రీన్‌సిగ్నల్
రాష్ట్ర మద్యం మార్కెట్లో దాదాపు 60% వాటా ఉన్న మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30.1% అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. ఈ కంపెనీ డిమాండ్‌నే మిగిలిన కంపెనీలూ అనుసరించాయి. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా 19% మేరకు బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. ఒక్క బీర్ల పెట్టె మీద 19% బేసిక్ ధర పెంచితే, దానికి కనీసం 300% వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. అదే జరిగితే ప్రస్తుతం రూ.150 ఉన్న లైట్బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్బీరు ధర రూ.200 వరకు పెరగవచ్చని టీజీబీసీఎల్ అంచనా వేస్తున్నది. ఇంతగా మద్యం ధరలు పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం నాటకాన్ని రక్తికట్టించిందని, ఇప్పుడు ధరలు పెంచకతప్పలేదని చెప్పడానికి ప్రభుత్వానికి అవకాశం దొరికినట్టు అయిందని టీజీబీసీఎల్ అధికారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు.
దిగువశ్రేణి కంపెనీలకు బిజినెస్ స్ట్రోక్
నిబంధన ప్రకారం సదరు మల్టీనేషనల్ బీర్ల కంపెనీ టీజీబీసీఎల్తో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు బీర్లు సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం మార్చి 31 వరకు బీర్ల సరఫరా చేయాల్సి ఉన్నది. కానీ, అర్ధాంతరంగా బీర్ల సరఫరా నిలిపివేసింది. పెద్ద కంపెనీ బీర్ల సరఫరా ఆగిపోవటంతో. దిగువశ్రేణి కంపెనీలు తమ బ్రాండ్ ఉత్పత్తులను భారీగా పెంచుకున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉన్న ఒక బీర్ల కంపెనీ ప్రత్యేక అనుమతులు తీసుకొని తమ బ్రాండ్ బీర్ల పరిమితిని పెంచి సరఫరా చేసింది. ఈ బీర్లు ప్రస్తుతం టీజీబీసీఎల్ డిపోలు, గోదాముల్లో నిల్వ ఉన్నాయి. ఈ ఉత్పత్తులను దెబ్బతీస్తూ యూబీ మళ్లీ తమ బ్రాండ్‌ను సరఫరా చేస్తున్నట్టు ప్రకటించడంతో, దిగువశ్రేణి కంపెనీలకు బిజినెస్స్ట్రోక్ ఇచ్చినట్టు అయిందని పేరు చెప్పడానికి ఇష్టపడని బీర్ల కంపెనీ వ్యాపారి పేర్కొన్నారు. తాము ఉత్పత్తి చేసిన బీర్లు 3 నెలల్లోగా అమ్ముడుపోకపోతే, ఆ తరువాత ప్రతి నెలకు పెట్టె మీద రూ.90 గోదాం చార్జీలు వసూలుచేస్తారని, అంత భారం మోయడం సాధ్యం కాదు కాబట్టి, మూడు నెలల అనంతరం మిగిలిన స్టాక్ మొత్తాన్ని పారబోయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఎవరూ పూడ్చలేని నష్టమని ప్రభుత్వం, పెద్ద కంపెనీ కలిసే తమను దెబ్బకొట్టాయని వాపోయారు. కోర్టుకు వెళ్లి పెద్ద కంపెనీకి ముకుతాడు వేయాల్సిన ప్రభుత్వం, వారి డిమాండ్‌కు తలొగ్గడం విడ్డూరమని అన్నారు. కాగా సోమవారం సాయంత్రం సచివాలయంలో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరికిరణ్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, బీర్ల కంపెనీల యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఆయా కంపెనీల పెండింగ్ బిల్లుల వివరాలు తీసుకున్నట్టు తెలిసింది. ధరల నిర్ణయ కమిటీ చేసిన సిఫారసుల మీద కూడా చర్చించినట్టు సమాచారం.