దిలావర్పూర్, జనవరి 4 : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్ – గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు, రైతుల పిలుపు మేరకు గురువారం మండలంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ మేరకు అన్ని గ్రామాల్లో వ్యాపారులు బంద్ పాటించారు. ఉదయం 9 గంటలకే గుండంపల్లి, దిలావర్పూర్, న్యూ లోలం గ్రామాలకు చెందిన దాదాపు 2 వేల మంది రైతులు, ప్రజలు జాతీయ రహదారి-61పైకి చేరుకొని టెంటు వేసుకొని బైఠాయించారు. పోలీసుల అనుమతితో రహదారిపైనే సహపంక్తి భోజనాలు చేశారు. దాదాపు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
60 మందిపై కేసు
ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ స్థలాన్ని బుధవారం ముట్టడించి.. గోడలు కూల్చివేసి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పు పెట్టిన పలువురు రైతులు, యువకులపై కేసులు నమోదు చేసినట్టు దిలావర్పూర్ ఎస్సై యాసీర్ అరాఫత్ తెలిపారు. కంపెనీ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు 60 మంది రైతులు, యువకులపై కేసులు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ వద్ద విధులు నిర్వహించడానికి వచ్చిన లోకేశ్వరం మండలానికి చెందిన ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ లక్కపెల్లి జీవన్‌రావు, భైంసాకు చెందిన ఎస్బీ కానిస్టేబుల్ జే శంకర్రావు సెల్ ఫోన్లు ధ్వంసం చేసిన ఘటనలో ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కొందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు కూడా పెట్టినట్టు తెలిపారు.