హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తిరుపతి తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యం వహించిన డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిని ఏపీ సర్కారు సస్పెండ్ చేసింది. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌పై బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నది. అధికారులు, పోలీసుల వైఫల్యంతోనే ఘటన జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. టోకెన్ల జారీ కేంద్రానికి 2వేల మందికే అవకాశం ఉన్నప్పటికీ.. 2500 మందిని ఒకేసారి పంపటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందినట్టు వెల్లడైంది. కాగా, ఘటనపై తిరుపతి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం కారణంగానే తొకిసలాట జరిగిందని నివేదికలో పేరొన్నట్టు సమాచారం.
తొకిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదని, వెంటనే ఎస్పీ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి భక్తులకు సాయం చేశారని రిపోర్టులో తెలిపారు. అంబులెన్స్‌ను టోకెన్ బయట పార్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాలపాటు అందుబాటులోకి రాలేదని పేరొన్నారు. మరోవైపు డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొకిసలాట జరిగినట్టు ప్రాథమికంగా తెలిసిందని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మంత్రులు గురువారం పరిశీలించారు. అనంతరం రుయా దవాఖాన వద్ద చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.
తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబాల్లో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం, పాక్షికంగా గాయాలైన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. తొకిసలాట అనంతరం తిరుపతిలోని అన్ని కౌంటర్లలోనూ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్ల జారీని శరవేగంగా చేపట్టారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకూ టోకెన్లు జారీ చేశారు. మళ్లీ గురువారం తెల్లవారుజామున 5గంటలకు కౌంటర్లను తెరిచి, టికెట్ల జారీని కొనసాగించారు. ఉదయం 10 నుంచి 11గంటల వరకు టికెట్ల పంపిణీ ముగిసింది. మొత్తం లక్షా 20వేల సర్వదర్శనం టోకెన్లను భక్తులకు అందజేశారు.