వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 24: వరంగల్లోని ఎంజీఎం దవాఖానలోని పీడియాట్రిక్ విభాగంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడి ఆక్సిజన్ అం దక రెండు నెలల బాబు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వాజేడు మండలం ఏడుచెర్లపల్లికి చెందిన నాగారపు గణేశ్- సంధ్యల రెండు నెలల కుమారుడు మోక్షిత్ అనారోగ్య సమస్యలతో వరంగల్లోని ఎంజీఎం దవాఖాన పీడియాట్రిక్ వార్డు లో నాలుగు రోజుల క్రితం అడ్మిట్ అయ్యాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో వెంటిలేటర్ పనిచేయలేదు. దీంతో ఆక్సిజన్ అందక మోక్షిత్ మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ మృత శిశువుతో ఆందోళన నిర్వహించారు. వైద్యాధికారులు స్పందిస్తూ శిశువు మృతి చెందిన సమయంలో విద్యుత్తు అంతరాయం లేదని, అత్యాధునిక జనరేటర్ (ఆటోమేటిక్ ఆన్ సిస్టమ్), వెంటిలేటర్ పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని పేర్కొన్నారు. శిశువు ఆరోగ్యస్థితి విషమంగా ఉందని, తల్లిదండ్రులకు ముందుగానే వివరించామని చెప్పారు. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో శిశువు మృతి చెందాడని పేర్కొన్నారు.