భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కురవి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని శివారు తాట్యా తండా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు డ్రైవర్ల క్యాబిన్లో ఇరుక్కుపోయి మూడు గంటలపాటు నరకయాతన అనుభవించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. వారిని అతికష్టం మీద బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఇద్దరిని దవాఖానకు తరలించారు.
భూపాలపల్లి జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన ఇంచర్ల రాజు.. బొగ్గు లోడుతో పాల్వంచకు వెళుతున్నాడు. అదే సమయంలో భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందిన ఎండీ హైదర్ పాల్వంచలో బొగ్గు లోడును దింపి బూడిదతో తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కురవి మండలం తాట్యాతండా వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీల ముందు భాగమైన క్యాబిన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు అందులో ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్ర గాయాలతో బాధపడుతున్న వారిని బయటకు తీసేందుకు మూడు గంటలపాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
వారిని లారీల్లోనుంచి బయటకు తీసుకురావడానికి యత్నించినప్పటీ వీలుకాకపోవడంతో జేసీబీల సహాయం తీసుకున్నారు. అయినా కష్టంగా మారడంతో వారిని అందులోనే ఉంచి ప్రథమచికిత్స అందించారు. 108 అంబులెన్స్ సిబ్బందితో సెలైన్ ఎక్కించారు. అనంతరం గ్యాస్ కట్టర్లను తెప్పించి క్యాబిన్లను కట్ చేసి వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఎంజీఎం హాస్పిటల్‌కు, అటునుంచి ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.