కొత్తకోట, ఏప్రిల్ 23: పెట్రోల్ తీసుకొస్తానని తండ్రి, చెల్లిని మూత్ర విసర్జనకు తీసుకెళ్లేందుకు తల్లి వెళ్లగా, బైక్‌పైనే కూర్చున్న ఆ చిన్నారులను కారు రూపంలో మృత్యువు కబలించింది. ఈ విషాద ఘటన శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కుడుకుంట్ల స్టేజీ వద్ద చోటుచేసుకొన్నది. పెబ్బేరు మండలం శాఖాపూర్‌కు చెందిన శివకుమార్, పార్వతి దంపతులు పిల్లలతో కలిసి కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లిలో బొడ్రాయి ప్రతిష్ఠ పూజకు వెళ్లి తిరుగుప్రయాణం అయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో కడుకుంట్ల స్టేజీ వద్ద బైక్ పెట్రోల్ అయిపోవటంతో శివకుమార్ బైక్‌ను పక్కన ఆపి, పెట్రోల్ కోసం వెళ్లాడు.
ఇద్దరు పిల్లలను బైక్‌పై కూర్చోబెట్టిన పార్వతి.. చిన్న కూతురిని మూత్ర విసర్జన కోసం పక్కకు తీసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంతో నడిపి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు చిన్నారులు ఎగిరిపడటంతో హేమ్తేజ్ (6) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఆరాధ్య (4)ను అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.