హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్ చేయడమే పెద్ద నేరమైంది. ప్రజా సమస్యలను తమ చానల్ ద్వారా ప్రసారం చేయడమే కాంగ్రెస్ సర్కారుకు కంటగింపుగా మారిం ది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అంటూ మహిళా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నది. బుధవారం తెల్లవారుజామున 4గంటలకే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ‘పల్స్న్యూస్ బ్రేక్’ చానల్ జర్నలిస్ట్ రేవతి ఇంటికి 18 మంది పోలీసులు చేరుకున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేస్తున్నామంటూ తన ఫోన్‌తోపాటు ఆమె భర్త ఫోన్‌ను లాక్కున్నారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా ఓరైతు మాట్లాడిన వీడియోను తన యూట్యూబ్ చానల్లో పోస్టు చేసినందుకు అరెస్టు చేస్తున్నట్టు ఆమెకు నోటీసు ఇచ్చారు. అదే సమయంలో కొత్తూరులో మరో మహిళా జర్నలిస్ట్ సంధ్య అలియాస్ తన్వీ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లి ఆమెను కూడా అరెస్ట్ చేశారు. వారిని ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారో కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న రేవతి తరఫు లాయర్ సీసీఎస్ చేరుకొని వాకబు చేయగా, తమకేమీ తెలియదని వారు చెప్పారు. ఇదే క్రమంలో 8గంటల పాటు మహిళా జర్నలిస్టులిద్దరినీ రహస్యంగా విచారించారు. పోస్టులు పెట్టడం వెనుక అసలు కారణమేంటని పోలీసులు పదేపదే ప్రశ్నించినట్టు సమాచారం. కాసేపటికి మహిళా జర్నలిస్టుల అరెస్టు విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మహిళా జర్నలిస్టుల అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ఎక్స్‌లో రేవతి వీడియో పోస్ట్..!
అంతకుముందు ఎక్స్‌లో రేవతి ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘నా ఇంటి గుమ్మం వద్ద పోలీసులు ఉన్నారు.. వారు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. వారు నన్ను ఎత్తుకుని తీసుకెళ్లవచ్చు.. ఒక విషయం స్పష్టమవుతున్నది.. సీఎం రేవంత్ రెడ్డి నా గొంతు నొక్కాలని.. బెదిరించాలని చూస్తున్నారు. కుటుంబసభ్యులపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. నన్ను బెదిరించాలనుకుంటున్నారు’ అని మాట్లాడిన వీడియో పోస్ట్ చేశారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్యాగ్ చేస్తూ రేవతి అరెస్ట్‌ను సీరియస్‌గా ఖండించారు.
వీడియో పోస్ట్ చేసినందుకే అరెస్ట్: అడిషనల్ సీపీ విశ్వప్రసాద్
సోషల్‌మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేసినందుకు పల్స్ యూట్యూబ్ చానల్ నిర్వాహకురాలు జర్నలిస్ట్ రేవతి, మరో జర్నలిస్ట్ బండి సంధ్య అలియాస్ తన్వీయాదవ్ను అరెస్ట్ చేశామని హైదరాబాద్ క్రైమ్ విభాగం అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. బుధవారం సీసీఎస్ బిల్డింగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టుల అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు అడిషనల్ సీపీ వెల్లడించారు. నిప్పుకోడి అనే ఎక్స్హ్యాండిల్లో సీఎం రేవంత్‌రెడ్డిని తిడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిందంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి కైలాశ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారని, పల్స్ టీవీ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేయించినట్టు తమ దర్యాప్తులో తేలిందని విశ్వప్రసాద్ చెప్పారు. పల్స్ టీవీలో వచ్చిన ఈ వీడియోను నిప్పుకోడి అనే ఎక్స్ హ్యాండిల్లో ట్రోల్ చేశారని కేసు దర్యాప్తు చేసి ఈ ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. కైలాశ్ ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 67ఐటీయాక్ట్, 111బీఎన్ఎస్, 61(2),353(2),352 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం మాదాపూర్‌లోని పల్స్ టీవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి 2ల్యాప్‌టాప్‌లు, 2 హార్డ్‌డిస్క్‌లు, లోగో, రూటర్, 7సీపీయూలు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రేవతిపై గతంలో ఎల్బీనగర్, బంజారాహిల్స్‌లో కేసులు ఉన్నాయని విశ్వప్రసాద్ చెప్పారు. అరెస్ట్ చేసిన ఈ ఇద్దరిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రేవతి అరెస్ట్‌ను ఖండించిన ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’
పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ రేవతి అరెస్ట్‌ను ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అనంత్నాథ్, జనరల్ సెక్రటరీ రుబెన్ బెనర్జీ, కోశాధికారి కేవీ ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెల్లవారుజామున రేవతితో పాటు, ఆమె భర్తను ఇంట్లో నుంచి పోలీసులు తీసుకెళ్లడం దారుణం అని అభిప్రాయపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవతి హక్కులను, వ్యక్తిగత భద్రతను కాపాడాలని డిమాండ్ చేసింది.