మహబూబాబాద్ రూరల్/ గూడూరు, సెప్టెంబర్ 14 : ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారాయి. యూరియా విషయంలో సర్కారు అనాలోచిత నిర్ణయాలు రైతుల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఓ పక్క పంటల అదును దాటిపోతుండటం, మరో పక్క యూరియా దొరకకపోవడంతో అన్నదాతలు పడరానిపాట్లు పడుతున్నారు. ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో ఆదివారం పొద్దున్నే యూరియా కోసం బయలు దేరిన ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడగా ఆ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జగన్నాయకులుగూడెం వద్ద ఎన్‌హెచ్-365పై జరిగింది.
ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గూడూరు మండలం దుబ్బగూడెంకు చెందిన బానోత్ లాల్య (77), జోషితండాకు చెందిన ధరావత్ వీరన్న (46) సమీప గ్రామమైన బొద్దుగొండ రైతువేదికలో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని తెలిసి, ఆదివారం ఉదయం 6.30 గంటలకు బైక్‌పై బయలుదేరారు. జగన్నాయకులగూడెం క్రాస్‌రోడ్ సమీపంలో మహబూబాబాద్ నుంచి గూడూరు వైపునకు వస్తున్న బొలేరో వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బానోత్ లాల్య తలకు తీవ్రగాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. తీవ్ర గాయాలతో ఉన్న వీరన్నను పోలీసులు మహబూబాబాద్ ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మంలోని ఓ దవాఖానకు తరలిస్తుండగా వీరన్న కూడా మృతి చెందాడు. బానోత్ లాల్య భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్ చొక్క లింగంపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మండల బాధ్యులు సంపత్‌రావు, ఆరె వీరన్న, నూకల సురేందర్, రహీం, కఠార్‌సింగ్, మోహన్, సుధాకర్‌రావు దుబ్బగూడెం గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ డిమాండ్ చేశారు. గూడూరు మండలంలో ఇద్దరు రైతులు మృతి చెందగా, మృతదేహాలను మహబూబాబాద్‌లోని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు మృతి చెందారని ఏరియా వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందిపడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఎలాంటి సమీక్షలు చేయకుండా రైతులు, యూరియా సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
కేసీఆర్ ముందు చూపుతో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా సకాలంలో యూరియాను అందించినట్టు గుర్తుచేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా దొరుకుతుందో లేదోనని రైతులు పొద్దున్నే బైక్‌పై వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కలిచివేసిందని ఆవేదన చెందారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి, బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేసియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం మృతుల కుటుంబాలను ఓదార్చి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.