చేగుంట/ గీసుగొండ మార్చి 5 : వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూర్ గ్రామానికి చెందిన ఆనందాస్ మహేశ్(35) చేసిన అప్పులు తీర్చేందుకు కొద్ది రోజుల క్రితం తన వ్యవసాయభూమిని విక్రయించాడు. భూమి లేకపోవడంతో ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి అని ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయం మాల గుట్ట వద్ద మహేశ్ చెట్టుకు ఉరివేసుకుని ఉండటాన్ని గ్రామస్థులు గమనించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఆరెపల్లిలో గువ్వాడి మోహన్రావు(32) పంట పెట్టుబడి కోసం అదే గ్రామానికి చెందిన పలువురి వద్ద నుంచి రూ. 3 లక్షల వరకు అప్పులు తీసుకున్నాడు. మక్కజొన్న, పత్తి పంటలు అనుకున్న స్థాయిలో పండకపోవడంతో తీవ్రమనస్తాపం చెంది మద్యానికి బానిసయ్యాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో తన ఇంటి ఆవరణలో గుర్తుతెలియని పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే 108 ద్వారా ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాబులాల్ తెలిపారు.