ఆదిలాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ)/హసన్పర్తి: మరో ఇద్దరు రైతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ భరించలేక ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతు, జాతీయ రహదారి నిర్మాణంలో భూమిని కోల్పోయినా పరిహారం అందక మనస్తాపంతో హనుమకొండ జిల్లాలో మరో రైతు తనువు చాలించారు. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం శంషాబాద్ గ్రామానికి గోవింద్రావు (37) 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, సోయాబీన్, కంది పంటలు వేశాడు.
పంటల సాగుకోసం రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడులు రాక నష్టం రావడంతో అప్పులు తీర్చలేకపోయాడు. తీవ్ర మనస్తాపం చెందిన గోవింద్రావు గురువారం సాగుచేస్తున్న వ్యవసాయ భూమిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతినికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారికి ప్రకటించిన సాయం వెంటనే అందజేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. నేడు జిల్లాలో పర్యటించనున్న బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ గోవింద్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు తెలిపారు.
రహదారి నిర్మాణంలో భూమిని కోల్పోయినా పరిహారం అందక తీవ్ర మనస్తాపానికి గురైన హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన గొర్రె సారయ్య (57) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. సారయ్యకు గ్రామ శివారులోని సర్వే నంబర్ 63/ఏలో 32 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ భూమి జాతీయ రహదారిలో పోయింది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదు. మిగతా వారికి పరిహారం అందినా తనకు రాకపోవడంతో సారయ్య మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థ్ధానికులు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే 108లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించగా సారయ్య అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.