కేసముద్రం/ చేగుంట,ఆగస్టు 22: మహబూబాబాద్, మెదక్ జిల్లాలో అప్పులబాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇంటికన్నెకు చెందిన గందసిరి బొందయ్య(50)కు ఎకరంనర పొలం ఉంది. అందులో వరి, మక్కజొన్న పండించేవాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చి రూ. 5 లక్షల వరకు అప్పులయ్యాయి.
దీంతో బొందయ్య మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. శుక్రవారం ఇంట్లో బొందయ్య గడ్డి మందు తాగగా.. స్థానికులు మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కు మారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై మురళీధర్రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్పల్లికి చెందిన రైతు తిరుపతి ఆంజనేయులు(49)ఇంటి నిర్మాణంతోపాటు వ్యవసాయానికి రూ.7లక్షల వరకు అప్పు చేశాడు.
ఇతడికి ఎకరం వ్యవసాయ భూమి ఉంది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురైన ఆంజనేయులు శుక్రవారం పొలం వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు భార్య పదేండ్ల క్రితం మృతిచెందింది. మృతుడి కుమారుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చైతన్యకుమార్రెడ్డి తెలిపారు.