హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో ఈనెల 15,16 తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా.. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. 16న బుధవారం శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నది.
ఈ క్రమంలో 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారని, దీంతో రెండ్రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రతి ఏడాది సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కరాటక సంక్రాంతి రోజు ఆణివార ఆస్థానం ఉత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపింది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పుష్పపల్లకీపై తిరుమల మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులను దర్శనమిస్తారని పేర్కొన్నది.