రఘునాథపాలెం, నవంబర్ 23: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానం వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శనివారం ఆటో షో ప్రారంభమైంది. సొంత కారు, బైక్ కలను సాకారం చేసుకునే వారి కోసం ఏర్పాటు చేసిన ఆటో సంస్థల ప్రదర్శన వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం మేయర్ పునకొల్లు నీరజ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన జీవనాన్ని ప్రతి కుటుంబం కోరుకుంటున్న తరుణంలో ఇటువంటి వేదికలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ‘నమస్తే తెలంగాణ’ ఇటువంటి షోలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖమ్మంతోపాటు హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అన్నిరకాల కంపెనీలు ఒకేచోట కలిసి ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. వినియోగదారుడి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఆటో షోను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా వాహనప్రియులు ఆటోషోకు రావడంతో ప్రాంగణం కిటకిటలాడింది. ఈ ఆటో షో నేడు ముగియనున్నది.
ఈ ఆటో షోలో వివిధరకాల మోడళ్లకు చెందిన కార్లు, బైక్‌లు కొలువుదీరాయి. మహావీర్ స్కోడా, కియా, సిట్రోయిన్ ప్రైడ్ మోటార్స్, ప్రైడ్ జీప్, స్పార్క్ హీరో, టాటా మోటార్స్, కాకతీయ టయోటా, వెంకటరమణ బజాజ్, మహీంద్రా కటకం హోండా, గ్రీన్ హోండా షోరూంలు అన్ని అన్నిరకాల వాహనాలను అందుబాటులో ఉంచాయి. రుణ సదుపాయం కల్పించేందుకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఆటో షోలో పాల్గొన్నాయి. టీవీ పార్టనర్‌గా టీ న్యూస్, డిజిటల్ పార్టనర్‌గా ఎస్ టీవీ వ్యవహరించాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆర్జేసీ, ఎస్బీఐటీ విద్యాసంస్థల అధినేత గుండాల కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పీఏ చిరుమామిళ్ల రవికిరణ్, మాటేటి కిరణ్, నమస్తే తెలంగాణ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ రమేశ్, బ్యూరో ఇన్చార్జ్ మాటేటి వేణు, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు, యాడ్ ఆఫీసర్లు నాగరాజు, సురేందర్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, సురేశ్, కరుణాకర్, దశరథ్, రిపోర్టర్లు పాల్గొన్నారు.