భీంపూర్/బెజ్జూర్, నవంబర్ 21: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పెన్‌గంగ శివారులోని గొల్లగఢ్, తాంసి (కే) అటవీప్రాంతంలో పశువుల మందలపై పులులు దాడి చేశాయి. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తాంసి(కే) అడవిలో పశువులు మేత మేస్తుండగా, ఒక్కసారిగా రెండు పులులు దాడి చేశాయి. అన్నెల స్వామికి చెందిన ఎద్దు ఈ దాడిలో మృతి చెందింది. ఆ పక్కన ఉన్న ఆవుల మందపైనా పులులుపంజా విసరడంతో మడావి శంకర్‌కు చెందిన రెండు ఆవు దూడలు చనిపోయాయి.
ఎఫ్ఆర్వో గులాబ్‌సింగ్, ఎఫ్ఎస్వో ప్రేంసింగ్, ఎఫ్‌బీవో శరత్‌రెడ్డి, కేశవ్ ఘటనా స్థలానికి వెళ్లి పులి పాదముద్రలు గుర్తించారు. కెమెరాలు అమర్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కర్జెల్లి రేంజ్ పరిధిలోని కుకుడ గ్రామంలో కాతెల శ్యాంరావుకు చెందిన కొట్టంలో కట్టేసిన ఎద్దుపై పులి దాడి చేసింది. కుటుంబసభ్యులు అరుపులు విని బయటకొచ్చి.. కేకలు వేయడంతో పులి అటవీప్రాంతంలోకి పరుగెత్తింది. పులి దాడిలో గాయపడ్డ ఎద్దును సెక్షన్ అధికారి వందన పరిశీలించారు.