Khammam | సత్తుపల్లిటౌన్, సెప్టెంబర్ 16: నీళ్లలో ఆట సరదా ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్నది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం సెలవు దినం కావడంతో బుగ్గపాడు గ్రామానికి చెందిన మడుపల్లి జితేందర్సాయి (9), పామర్తి శశాంక్ (9) మరో మిత్రుడు చరణ్‌తో కలిసి మధ్యాహ్నం భోజనం తర్వాత ఆడుకునేందుకు గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్దకు వెళ్లారు.
ఆడుకునేందుకు శశాంక్, జితేందర్సాయి నీటిలోకి దిగగా.. ఒడ్డునే ఉన్న చరణ్ వారిద్దరినీ వారించాడు. కాల్వలో నిలిచిన నీటిలోకి ప్రమాదవశాత్తు జారి ఇద్దరూ పడిపోయారు. మిత్రులు ఎంతకూ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన చరణ్ పరిగెత్తుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో జితేందర్సాయి తండ్రి శ్రీను, మరికొందరు గ్రామస్థులతో కలిసి కాల్వకు వద్దకు వెళ్లి చూడగా.. ఇద్దరు చిన్నారులు నీటిపై తేలియాడుతూ కనిపించారు.
వారిని బయటకు తీసి ప్రైవేటు వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతోనే సీతారామ ప్రాజెక్టు కాల్వ నీటిలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారని, దీనికి కాంట్రాక్టు సంస్థ ప్రసాద్ కో కంపెనీ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు కంపెనీ కార్యాలయం ఎదుట సోమవారం రాత్రి ఆందోళన చేపట్టారు. తక్షణమే కంపెనీ యాజమాన్యం స్పందించి మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.