హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధ జంటను ‘డిజిటల్ అరెస్టు’ చేసి, రూ.10.61 కోట్లు కాజేసిన ఘటనలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) పోలీసులు పురోగతి సాధించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టి.. కర్ణాటకకు చెందిన ఇద్దరు సైబర్ నేరస్థులను అరెస్టు చేసినట్టు సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయెల్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులకు సెప్టెంబరు 10 సాయంత్రం 5 గంటలకు వీడియో కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన ఇద్దరు తమను ముంబై పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. ఆ దంపతుల ఆధార్, పాన్‌కార్డులను ఉపయోగించి బ్యాంకు ఖాతా తెరిచారని, దాని ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ.. ఆ నేరాలు రుజువైతే 7 ఏండ్ల వరకు జైలుశిక్ష పడుతుందని బెదిరించారు. ఆ కేసులు లేకుండా చేయాలంటే తమకు కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని ఆ వృద్ధ దంపతులు చెప్పడంతో రూ.10.61 కోట్లను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు.. సీఎస్ పోలీసులను ఆశ్రయించగా బెంగళూరుకు చెందిన వినయ్‌కుమార్ ఖడ్కే, జీహెచ్ మారుతిని అరెస్టు చేసి 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ‘టింకన్ టెక్నాలజీస్’ ఖాతాకు రూ.4.62 కోట్లు బదిలీ చేసినట్టు గుర్తించారు.