చుంచుపల్లి, జూలై 6 : గుండెపోటుతో 12 ఏండ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో శనివారం చోటుచేసుకున్నది. చుంచుపల్లి మండలం సర్వారం పంచాయతీ పరిధిలోని గోపతండాకు చెందిన తేజావత్ హరికృష్ణ (12) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.
ఉదయం పాఠశాలకు వెళ్లిన హరికృష్ణ అక్కడే ఆవరణలో స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన సిబ్బంది హుటాహుటిన కొత్తగూడెం మాతా, శిశు దవాఖానకు తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటు వల్లే బాలుడు మరణించాడని, గతంలో రెండుసార్లు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స కూడా జరిగిందని వైద్యులు తెలిపారు.