బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:37:48

నెట్టింట్లో.. టీవీల్లో..

నెట్టింట్లో.. టీవీల్లో..

  • లాక్‌డౌన్‌లో 43% పెరిగిన టీవీ వీక్షకులు
  • పల్లెల్లోనూ పుంజుకున్న ఇంటర్నెట్‌
  • న్యూస్‌ చానళ్లకు ఆదరణ  రెట్టింపు
  • ఓటీటీ ప్లాట్‌ఫాంలకు పండుగ 
  • వెల్లడించిన బార్క్‌, నీల్సన్‌ సర్వే

లాక్‌డౌన్‌కు ముందు.. 

వీకెండ్‌ అంటే చాలు.. ఎక్కడికైనా లాంగ్‌డ్రైవ్‌! లేదంటే సాయంత్రానికి పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో! సాధారణ, మధ్యతరగతివారైతే మల్లీప్లెక్సుల్లో సినిమాలు.. రెస్టారెంట్లో భోజనాలు.. ఎవరన్నా స్నేహితులు పిలిస్తే.. వారి ఇండ్లలో దావత్‌లు! ఏ స్థాయివారైనా వారం రోజుల పని ఒత్తిడినుంచి రిలాక్స్‌ అయ్యే రోజు! ఇది కరోనాకు ముందు కాలం! 

ఇప్పుడు..

రోజూ వీకెండే! కానీ.. గడపదాటి ఎక్కడికీ వెళ్లటానికి లేదు! చాలామందికి ఇండ్లే ఆఫీసులయ్యాయి. పనులన్నీ ఫోన్లమీదే! మరి  ఎంటర్‌టైన్మెంట్‌? ఉన్న ఏకైక మార్గం.. టీవీ.. ఇంటర్నెట్‌! అందుకే లాక్‌డౌన్‌ విధించిన దగ్గర నుంచి టీవీ, ఇంటర్నెట్‌ వాడకం అనూహ్యంగా పెరిగిపోయిందని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. 


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దాదాపు 100 రోజుల లాక్‌డౌన్‌ సమయంలో దేశ ప్రజలు డిజిటల్‌ స్క్రీన్లకు అతుక్కుపోయారు. టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లే లోకంగా గడిపేశారు. వినోదానికి పెద్దపీట వేశారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన మొదటివారంలోనే టీవీ వీక్షకుల సంఖ్య 15% పెరిగిందని బార్క్‌, నీల్సన్‌ సర్వే వెల్లడించింది. లాక్‌డౌన్‌ సమయంలో గరిష్ఠంగా వీక్షకుల సంఖ్య 43% పెరిగింది. ఆ సంఖ్య 36.3 కోట్లకు చేరింది. వీరిలో ఎక్కువమంది వార్తా చానళ్లవైపు మొగ్గు చూపారు. కొవిడ్‌ ముందుతో పోల్చితే న్యూస్‌ చానళ్ల వీక్షకులు రెట్టింపయ్యారని అంచనా. లాక్‌డౌన్‌కు ముందు వినోదాత్మక చానళ్లు రాజ్యమేలేవి. సీరియళ్లు, రియాలిటీ షోలు దుమ్మురేపేవి. ఫలితంగా మొత్తం వీక్షకుల్లో 68% వరకు ఎంటర్‌టైన్మెంట్‌ చానళ్లే చూసేవారు. షూటింగ్‌లు ఆగిపోవడంతో కొత్త ఎపిసోడ్లు రాలేదు. పాతవాటినే తిప్పితిప్పి వేశారు. దీంతో వీక్షకుల సంఖ్య 47% వరకు పడిపోయింది.

టాప్‌గేర్‌లోకి ఓటీటీలు

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఆహా, వూట్‌, ఆల్ట్‌బాలాజీ వంటి ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) సర్వీసులు లాక్‌డౌన్‌ సమయంలో టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారుల సంఖ్య 60% వరకు పెరుగగా, దేశీయ ఓటీటీలకు 100% పెరుగుదల ఉన్నది. యానిమేషన్‌కు ఆదరణ అదిరింది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీ5 కిడ్స్‌, వూట్‌కిడ్స్‌ వంటి ఓటీటీల వీక్షకుల సంఖ్య 200% పెరిగింది. 

నెట్టిల్లుగా మారిన పల్లెలు 

లాక్‌డౌన్‌లో ఇంటర్నెట్‌ వినియోగం 60-70% వరకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 57.4 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. ఈ ఏడాది చివరినాటికి ఆ సంఖ్య 63 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో 27 కోట్లమంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. 2019తో పోల్చితే పల్లెల్లో 45 శాతం వినియోగం పెరుగగా, పట్టణాల్లో ఇది 11 శాతంగా నమోదైంది. నగరాల్లో లాక్‌డౌన్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు 40% వరకు పెరిగారు. దాదాపు అన్ని మెట్రోనగరాల్లో డాటా స్పీడ్‌ తగ్గిపోయింది. ప్రస్తుతం అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతుండటంతో వేగం మళ్లీ పెరిగింది. గత రెండువారాల్లో హైదరాబాద్‌లో ఇంటర్నెట్‌ వేగం 33.1% పెరిగిందని స్పీడ్‌ ట్రాకర్‌ సంస్థ తెలిలింది. ఇక ద్వితీయశ్రేణి నగరాల్లో 23-25% వరకు వేగం పెరిగిందని వెల్లడించింది.

సర్వేలోని కొన్ని వివరాలు ఇలా.. 

  • లాక్‌డౌన్‌లో వివిధ భాషల్లో రామాయణం, మహాభారతం వ్యూస్‌ 1900 కోట్లు.
  • టీవీ చూస్తూ గడిపే సమయం 20 శాతం వరకు పెరిగింది. 
  • లాక్‌డౌన్‌లో ఇంటర్నెట్‌ వినియోగం 60-70 శాతం వరకు పెరిగింది.
  • లాక్‌డౌన్‌ సమయంలో 1.8 కోట్లమంది బ్రాడ్‌బ్యాం డ్‌ వినియోగదారులు ఉండగా, సగటున 18 జీబీ వినియోగించారు. ఇది గతంతో పోల్చితే రెట్టింపు.
  • 30% వరకు పెరిగిన మొబైల్‌ డాటా వినియోగంlogo