Padutha Theeyaga | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ) : ఈటీవీలో ప్రసారమవుతున్న సింగింగ్ రియాల్టీ షో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం వివాదాలకు వేదికగా మారింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ఈ కార్యక్రమం దాదాపు 30 ఏండ్లుగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గాయని సునీత తనను తీవ్రంగా అవమానించారంటూ ఓ గాయని ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. న్యాయ నిర్ణేతలు తనను మానసికంగా హింసించారని, బాడీషేమింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు.
పోటీదారులను వారు చీడపురుగుల్లా చూస్తారని, వివక్ష చూపుతారని, తమ శరీరం మీద జోకులు వేస్తారని, ఇది తనను మానసికంగా కృంగిపోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిర్వాహకులు తనకు చీర ఇచ్చి దాన్ని బొడ్డు కిందికి కట్టుకోవాలని సూచించారని, ఇది తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. కాగా ప్రవస్తి ఆరోపణలను గాయని సునీత ఖండించారు. ఎవరు బాగా పాడినా ప్రోత్సహిస్తాం. సంగీతం విషయంలో చానల్స్ వారికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ ప్రేక్షకులకు వివరించు. పోటీదారులంతా నాకు సమానమే’ అని పేర్కొన్నారు.