ఎదులాపురం, సెప్టెంబర్ 9 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా, ఎన్నికల మ్యానిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన ఆరోగ్య పథకం హామీని నెరవేర్చకపోవడం విచారకరమని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీయూడబ్ల్యూజే ఆదిలాబాద్ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా జేహెచ్ఎస్ అమలుకాకపోవడంతో కార్పొరేట్ దవాఖానలో చికిత్స పొందే ఆర్థిక స్థోమత లేక, ఇప్పటికే వందల సంఖ్యలో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి ఫలితం కనిపించలేదని చెప్పారు. ఇప్పటికైనా ఆరోగ్య పథకాన్ని అమలుచేసి జర్నలిస్టుల ప్రాణాలకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాలో 15 మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, వారి అక్రెడిటేషన్ కార్డులను లాకోవడం సహించరానిదని మండిపడ్డారు. వెంటనే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు.
జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా.. అక్రెడిటేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న జర్నలిస్టులపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో విచారణ జరిపించడం సరికాదని చెప్పారు. ఈ అధికారుల వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీ య కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, యూనియన్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎలగందుల రవీందర్, ప్రకాశ్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం నాయకుడు హన్మం త్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, కార్యదర్శి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.